Revanth Reddy: రేవంత్ రెడ్డి కోసం 20 ప్రశ్నలను సిద్ధం చేసిన ఐటీ శాఖ అధికారులు!
- నేడు ఐటీ అధికారుల విచారణకు రేవంత్ రెడ్డి
- రూ. 50 లక్షలు ఎక్కడివో ఇంతవరకూ తేల్చలేకపోయిన అధికారులు
- రేవంత్ నుంచి సమాధానం రాబట్టే యోచనలో ఐటీ విభాగం
మరికాసేపట్లో తమ ముందుకు విచారణకు రానున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి కోసం 20 ప్రశ్నలను ఐటీ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఇప్పటికే కొండల్ రెడ్డి తదితరులను ప్రశ్నించిన అధికారులు నేడు రేవంత్ ను ప్రశ్నించనున్నారు. రేవంత్ స్వయంగా తీసుకెళ్లి స్టీవెన్ సన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడివో ఇంతవరకూ తేల్చలేకపోయిన ఐటీ అధికారులు, ఆ డబ్బు ఎక్కడిదన్న కోణంలో ప్రశ్నించి రేవంత్ నుంచి సమాధానం రాబట్టాలని ప్రయత్నించనున్నారు.
ఇదే సమయంలో ఆయనకు ఆఫర్ చేసిన రూ. 5 కోట్లలో మిగతా నాలుగున్నర కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తేవాలని ప్లాన్ చేశారన్న ప్రశ్ననూ ఆయన ముందు ఉంచనున్నారు. రేవంత్ సంపాదన, ఆయన ఆస్తులు, ఇంటి చిరునామాపై ఉన్న కంపెనీల వివరాలు, ఆయన డైరెక్టర్ గా ఉన్న కంపెనీల వివరాలపైనా ప్రశ్నలు సిద్ధం చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నాలుగు రోజుల క్రితం తాము జరిపిన సోదాల్లో పట్టుబడిన డాక్యుమెంట్ల గురించి కూడా రేవంత్ నుంచి మరిన్ని వివరాలను రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు.