Vijay Devarakonda: తన అభిమానులకు విజయ్ దేవరకొండ సలహా!
- అభిమానులను పెంచుకుంటూ పోతున్న విజయ్ దేవరకొండ
- సోషల్ మీడియాలో కామెంట్లు పాజిటివ్ గా ఉండాలి
- మాటల యుద్ధాన్ని అంగీకరించబోనని వెల్లడి
రోజురోజుకూ అభిమానులను పెంచుకుంటూ పోతున్న నటుడు విజయ్ దేవరకొండ, సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా, ఫ్యాన్స్ కు ఓ సలహా ఇచ్చాడు. "సంఖ్యాపరంగా మనం పెరుగుతూ వెళుతున్నాం. స్వయంగా మనకు మనమే నిబంధనలు విధించుకోవాల్సిన సమయం ఇది. మనం యువకులం. మీరు, నేను కలిస్తే, దేన్నయినా మార్చవచ్చు" అని అభిప్రాయపడ్డాడు. రౌడీ లైఫ్ స్టయిల్ అయినా, దాన్నే మనం ఆటిట్యూడ్ అనుకున్నా ఫర్వాలేదని, ఇదే సమయంలో సోషల్ మీడియాలో పెట్టే కామెంట్లు పాజిటివ్ గా ఉండాలని సూచించాడు.
చాలా మంది తమ డిస్ ప్లే పిక్చర్ గా తన ఫొటోలు పెట్టుకుంటున్నారని గుర్తు చేసిన విజయ్, అది తనకెంతో సంతోషకరమని అన్నాడు. అయితే, ఇతరులపై మాటల యుద్ధం తగదని, దాన్ని తాను అంగీకరించబోనని చెప్పాడు. ఒకరి జీవితం గురించి, వారి జీవన విధానం గురించి చర్చించే హక్కు, కామెంట్లు చేసే హక్కు ఇతరులకు లేదన్నాడు. తనవరకూ ద్వేషించే వారు కూడా బాగుండాలని కోరుకుంటానని చెప్పాడు. తాను ఎప్పటికీ మంచి సినిమాలనే చేస్తానని, మంచి దుస్తులనే ఇస్తానని, ఇకపై ఫ్యాన్స్ ఆన్ లైన్లో ఎలాంటి దూషణలకూ దిగవద్దని సూచించాడు.