kolkata: అగ్నికీలల్లో మెడికల్ కళాశాల ఆస్పత్రి : 250 మందికి తృటిలో తప్పిన ప్రమాదం
- ఫార్మసీ డిపార్ట్మెంట్లో తొలుత వ్యాపించిన మంటలు
- భయంతో కిటికీల్లోంచి దూకేసిన కొందరు రోగులు
- మంటలార్పుతున్న పది అగ్నిమాపక శకటాలు
కోల్కతాలోని ఓ వైద్యకళాశాల అనుబంధ ఆస్పత్రి అగ్నికీలల్లో చిక్కుకుంది. ఫార్మసీ విభాగాన్ని ఒక్కసారిగా పొగలు చుట్టుముట్టడంతో రోగులు భయాందోళనలకు గురయ్యారు. 250 మంది రోగులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... కోల్ కతాలోని ఓ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రి ఫార్మసీ విభాగంలో ఉదయం ఒక్కసారిగా పొగలు చుట్టుముట్టాయి. అనంతరం మంటలు వ్యాపించడంతో రోగులు భయాందోళనలకు గురయ్యారు.
దాంతో ఎవరికి వారు సమీపంలోని కిటికీల నుంచి దూకి చాలామంది తప్పించుకున్నారు. కదలలేని రోగులు నిస్సహాయ స్థితిలో సహాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మిగిలిన రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆస్పత్రిలోని రోగులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. పది అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.