IMD: వర్షాలెక్కడ?... అంచనాలు తప్పిన వాతావరణ శాఖ!
- వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన ఐఎండీ
- సగటు కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు
- వర్షాభావమేనని ఇస్రో వేసిన అంచనాలే నిజం
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి... రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... ఇటీవలి కాలంలో వాతావరణ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికలివి. అయితే, వర్షాలు రాలేదు సరికదా... సగటు ఉష్ఠోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. ఈ సీజన్ లో వాతావరణ శాఖ అంచనాలకన్నా 9 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. అధికారుల అంచనాలు తప్పాయి. మధ్య భారతావనిలో 99 శాతానికి గాను 93 శాతం, దక్షిణాదిలో 95 శాతానికి గాను 98 శాతం, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 93 శాతానికిగాను 76 శాతం వర్షాలే పడ్డాయి.
మొత్తానికి నైరుతీ రుతుపవనాల సీజన్ లో వర్షాలపై భారత వాతావరణ శాఖ అంచనాలు తప్పాయని ఇప్పుడు చర్చ జరుగుతోంది. నైరుతిలో వర్షాభావం ఉంటుందని ఇస్రో వేసిన అంచనాలు నిజమయ్యాయి. ఐఎండీ అధికారులు దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలకూ కలిపి అంచనాలను వెలువరించడంతోనే ఈ సమస్య పెద్దదిగా కనిపిస్తుందని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు.