Bollywood: అప్పట్లో నాతో ప్రేమ నటించాడు.. చాలా రోజులు ఎంతో బాధపడ్డాను: బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి
- శిల్పాశెట్టి కళాశాల విద్యార్థిగా ఉన్నప్పటి సంఘటన
- ఓ అబ్బాయి వాళ్లింటికి రోజూ ఫోన్ చేసేవాడు
- ఆ ఫోన్ కాల్ కోసం ఆమె ఎదురుచూసేది
బాలీవుడ్ బ్యూటీ, పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘హియర్ మి లవ్ మి’. ఈ షో గురించి ఆమె మాట్లాడుతూ, వినోదాన్ని అందించే ఈ తరహా రియాల్టీ షోలను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని చెప్పింది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి తాను కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పింది.
ఓ అబ్బాయి ప్రతి సాయంత్రం తమ ఇంటి ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసేవాడని, ఆ ఫోన్ కాల్ కోసం తాను ఎదురుచూసే దాన్ని అని, తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఆ ఫోన్ కాల్ ని కట్ చేసే దాన్నని చెప్పింది. ఆ వయసులో ఇలాంటి వాటికి ఏ అమ్మాయి ఆకర్షితురాలు కాదన్న శిల్పాశెట్టి, ఆ అబ్బాయి కనీసం తన పేరు కూడా చెప్పలేదని చెప్పింది. ఓరోజు బస్టాప్ లో కలుద్దామని అతనికి చెప్పానని, కానీ, అతడు రాకపోవడంతో బాధపడ్డానని, ఆ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.
‘అసలు సంగతి, ఆ తర్వాత నాకు తెలిసింది. నా స్నేహితులతో అతను పందెం కట్టాడని, అందుకే, నాతో ప్రేమ నటించాడని తెలిసింది. ఇదంతా.. ఓ సినిమా కథలా అనిపించొచ్చు కానీ, ఇది నిజం. పందెంలో గెలవడం కోసమే అలా నటించిన అతను, నాతో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ సంఘటన నన్ను ఆవేదనకు గురిచేయలేదని చెప్పను. చాలా రోజులు ఎంతో బాధపడ్డాను’ అని శిల్పాశెట్టి చెప్పింది.