mayawathi: కాంగ్రెస్ తో పొత్తు లేదు.. ఒంటరిగానే పోటీ చేస్తాం!: మాయావతి
- కాంగ్రెస్తో పొత్తుకు ససేమిరా
- సంకీర్ణ పక్షాలపైనే కాంగ్రెస్ దాడి
- దిగ్విజయ్ సీబీఐకి భయపడుతున్నారు
కాంగ్రెస్తో పొత్తు విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి పట్టు వీడట్లేదు. గతంలోనే ఆమె కాంగ్రెస్తో పొత్తుకు ససేమిరా అన్న విషయం తెలిసిందే. మరోసారి అదే విషయాన్ని మాయావతి స్పష్టం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని... ఛత్తీస్గఢ్లో స్థానిక పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆమె వెల్లడించారు.
లక్నోలో మాయావతి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కులతత్వం పెరిగిపోయిందని విమర్శించారు. బీజేపీని వదిలేసి సంకీర్ణ పక్షాలపైనే కాంగ్రెస్ దాడి చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిగ్విజయ్... ఆర్ఎస్ఎస్ నేతగా వ్యవహరిస్తున్నారంటూ మాయావతి ధ్వజమెత్తారు. ఆయన సీబీఐకి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ బీఎస్పీతో పొత్తుకు ప్రయత్నిస్తుంటే దిగ్విజయ్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.