New Delhi: ఆమె తనపై అత్యాచారానికి పాల్పడిందన్న యువతి.. ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్న పోలీసులు!
- ఆన్‌లైన్‌లో వస్త్రవ్యాపారం చేస్తున్న యువతి
- పెట్టుబడి పేరుతో యువతిపై ముగ్గురు అత్యాచారం
- 19 ఏళ్ల యువతి కూడా..
ఢిల్లీ పోలీసులకు ఇప్పుడో వింత సమస్య ఎదురైంది. ఓ యువతి తనపై అత్యాచారానికి పాల్పడిందంటూ 25 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో బాధిత యువతి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలని ఆమెనే తిరిగి ప్రశ్నించారు. పోలీసుల కథనం ప్రకారం..
బాధిత యువతి ఢిల్లీలో ఆన్‌లైన్ ద్వారా వస్త్రవ్యాపారం చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఆమెకు రోహిత్ అనే వ్యక్తి పరిచయమై పెట్టుబడి ఆశ చూపించాడు. ఈ క్రమంలో అతడు తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, దానిని వీడియో తీసి బెదిరించి ఆమెను ఓ ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం చేయించాడు.
ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ 19 ఏళ్ల యువతి తనపై సెక్స్ టాయ్స్‌తో అత్యాచారానికి పాల్పడేదని, అడ్డుకుంటే తీవ్రంగా కొట్టేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలో చెప్పాలో బాధితురాలినే తిరిగి పోలీసులు ప్రశ్నించడం గమనార్హం.
చివరికి, కేసు నమోదు చేసిన పోలీసులు రోహిత్, రాహుల్‌తోపాటు వారి స్నేహితుడు సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధిత యువతి ఆరోపించిన మరో యువతిపై మాత్రం పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీంతో బాధిత యువతి మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది.