Gali janardhan Reddy: ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో గాలి జనార్దనరెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి అరెస్ట్!
- ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో అదుపులోకి
- నేడు విచారణకు హాజరు కావాలంటూ ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు
- గాలి జనార్దనరెడ్డికి శ్రీనివాసరెడ్డి అత్యంత ఆప్తుడు
ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో గాలి జనార్దనరెడ్డి అనుచరుడు, శ్రీమినరల్స్ కంపెనీ యజమాని బీవీ శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి అత్యంత ఆప్తుడైన శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం ప్రకటించింది.
అలాగే, విచారణకు హాజరు కావాలంటూ బళ్లారి రూరల్ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, విజయనగర (హోస్పేట) ఎమ్మెల్యే ఆనంద్ సింగ్కు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరూ బుధవారమే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, హాజరు కాకపోవడంతో గురువారం విచారణకు తప్పకుండా హాజరుకావాలంటూ మరోమారు నోటీసులు పంపింది.
బళ్లారి జిల్లా సండూరు తాలూకా సిద్ధాపుర గ్రామంలో జూలై 2009 నుంచి డిసెంబరు వరకు 1.38 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వి అక్రమంగా రవాణా చేసినట్టు శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బెళెకేరి ఓడరేవులో నిల్వ చేసిన ముడి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన ఆరోపణలపై శాసనసభ్యులకు నోటీసులు జారీ చేశారు.