Alahabad: అర్థం కాకుండా రాసిన డాక్టర్లు... జరిమానా విధించిన హైకోర్టు!
- చదవడానికి వీల్లేని విధంగా రోగుల రిపోర్టులు
- కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్
- ఒక్కొక్కరిపై రూ. 5 వేల జరిమానా
ముగ్గురు డాక్టర్ల చేతిరాత ఏ మాత్రమూ అర్థం కాకుండా ఉందని, ఇది వారి నిర్లక్ష్యమేనని చెబుతూ, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తీర్పు ఇచ్చింది.
కేసుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, గోందా జిల్లాలోని సీతాపూర్, ఉన్నావో ఆసుపత్రికి వచ్చే రోగుల మెడికల్ రిపోర్టు విషయంలో డాక్టర్ టీపీ జైస్వాల్, డాక్టర్ పీకే గోయల్, డాక్టర్ ఆశిష్ సక్సేనాల చేతిరాత ఏమాత్రం బాగా లేదని, కనీసం చదవటానికి వీల్లేకుండా వారు రిపోర్టులు రాశారని దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు, వారికి సమన్లు జారీ చేసింది.
అనంతరం కేసును విచారించిన జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సంజయ్ హర్కౌలీలు, వారిపై విధించిన జరిమానాను కోర్టు లైబ్రరీలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలా అర్థం కాకుండా రాయవద్దని హితవు పలుకుతూ, ఈ మేరకు డాక్టర్ల రాతలు నలుగురికీ తెలిసేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శులకు నోటీసులు పంపింది.