KCR: కేసీఆర్ ను చంపేస్తామని పీపుల్స్ వార్ 1999లో ప్రకటించడాన్ని మర్చిపోయారా?: ఎల్.రమణ
- సొంత నియోజకవర్గానికి వెళ్లడానికే భయపడ్డాడు
- నిన్నటి సభలో లుచ్ఛా, లఫంగా మాటలు మాట్లాడాడు
- ప్రజా కోర్టులో కేసీఆర్ కు శిక్ష పడేలా చేస్తామని వెల్లడి
ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న నిజామాబాద్ సభలో లుచ్ఛా, లఫంగా మాటలు మాట్లాడారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. కేసీఆర్ జీవితమంతా దొంగ పాస్ పోర్టులు, దొంగ వీసాలు, దొంగ బతుకేనని ఆరోపించారు. తానేదో శ్రీరామ చంద్రుడిగా కనిపించేందుకు ఆయన యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ఇప్పుడు కుదరదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
1999 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి గల కారణాన్ని చెప్పాలని రమణ డిమాండ్ చేశారు. అదే ఏడాది కేసీఆర్ భూస్వామ్య ప్రవర్తనతో ఆగ్రహించిన పీపుల్స్ వార్.. ‘కేసీఆర్ కు మరణదండన’ పేరుతో హెచ్చరిక జారీచేసిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎంగా దళితుడిని చేస్తామని చెప్పిన కేసీఆర్ సీఎం కుర్చీపై కూర్చున్నాడని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అవకతవకలను ప్రశ్నిస్తూనే ఉంటామనీ, కేసీఆర్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. 2009లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే టీడీపీతో జట్టుకట్టారా? అని సీఎంను రమణ ప్రశ్నించారు.
పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు పడేయడానికి తెలంగాణ ఏమైనా నీ యబ్బ జాగీరా? అని రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా, ఎక్కడైనా పోటీ చేసే అధికారం, హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. సీఎం కారణంగానే ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందన్నారు. ప్రజల సొమ్ముతో ప్రజాభవన్ లో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోందని విమర్శించారు. కేసీఆర్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.