gvl narasimha rao: చంద్రబాబు, కేసీఆర్ ల భయం త్వరలోనే నిజం కాబోతోంది: జీవీఎల్
- అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కూడా కేసీఆర్ చెప్పలేకపోతున్నారు
- మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయం కేసీఆర్ కు ఉంది
- టీడీపీ శని బీజేపీని వదిలి కాంగ్రెస్ ను పట్టుకుంది
మే నెలలో ప్రధాని మోదీని ఎదుర్కొనే శక్తి లేకనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కూడా కేసీఆర్ ఇంతవరకు చెప్పలేక పోయారని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా కేసీఆర్ జంకుతున్నారని చెప్పారు. మే నెలలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే... మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తొలి నుంచి ఆకాంక్షించిన ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు.
టీడీపీ శని తమను వదిలి ఇప్పుడు కాంగ్రెస్ ను పట్టుకుందని జీవీఎల్ అన్నారు. ఏపీలో అభివృద్ధి లేదని... అన్నీ అప్పులే ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చనందున కేసీఆర్ ప్రతి ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహా కూటమి తెలంగాణ ద్రోహుల కూటమి అని దుయ్యబట్టారు. బీజేపీని చూసి చంద్రబాబు, కేసీఆర్ లు భయపడుతున్నారని... త్వరలోనే వారి భయం నిజంకాబోతోందని చెప్పారు.