cag: దూకుడు పెంచిన కాంగ్రెస్.. రాఫెల్ వివాదంపై కాగ్‌కి మరోసారి ఫిర్యాదు
- రాజీవ్ మహర్షిని కలిసి ఫిర్యాదు
- అన్ని రుజువులనూ సమర్పించాం
- కొత్త విషయాలను కాగ్‌కి వివరించాం
ఇటీవలి కాలంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఇరుకునపెట్టింది. ఓ విధంగా చెప్పాలంటే, ఈ విషయంలో ప్రధాని మోదీని ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాజీవ్ మహర్షిని కలిసి ఫిర్యాదు చేసింది. కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలతో పాటు పలువురు నేతలు రాజీవ్ మహర్షికి ఇందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. నేడు వీరంతా మరోసారి కాగ్ని కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ... ‘రాఫెల్ ఒప్పందంలోని నిజాలను తెలుపుతూ అన్ని రుజువులను కాగ్‌కి సమర్పించాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను ఈ ఒప్పందం నుంచి తప్పించి ఓ ప్రైవేటు సంస్థకు లాభాలు కలిగేలా ప్రవర్తించిన విషయాన్ని వెల్లడించాం. ఈ ఒప్పందంలోని అన్ని విషయాలను ఇప్పటికే పరిశీలిస్తున్నామని రాజీవ్ తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన నివేదికను ప్రజల ముందుకి తీసుకొస్తే ఈ కుంభకోణం బయట పడుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి బయటకు వచ్చిన పలు కొత్త విషయాలను కాగ్‌కి వివరించామన్నారు.