KCR: ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పొడవు, జానారెడ్డి అంత ఎత్తు లేకున్నా జగదీశ్ రెడ్డి గట్టోడే: కేసీఆర్
- జిల్లాకు పవర్ ప్రాజెక్టు కావాలని అడిగిన ఏకైక నేత
- మరో రెండు నెలల్లోనే అందుబాటులోకి
- 8 వేల మందికి ఉపాధి అవకాశాలు
టీఆర్ఎస్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రతిపక్ష నేత జానా రెడ్డి అంత ఎత్తు లేకున్నా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పొడవు లేకున్నా జగదీశ్ రెడ్డి గట్టోడని కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో పవర్ ప్రాజెక్టు నిర్మించాలని ఒక్క నాయుకుడు కూడా అడగలేదని, కానీ జగదీశ్ రెడ్డి తమకు పవర్ ప్రాజెక్టు కావాలని అడిగాడని, పొట్టోడయినా జగదీశ్ రెడ్డి గట్టోడని ప్రశంసించారు. జగదీశ్ రెడ్డే జిల్లాకు ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటును తీసుకొచ్చాడని కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
దామరచర్ల వద్ద నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టు మరో రెండు నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.29,965 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు. ప్లాంట్ పూర్తయితే 8 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.