MVVSMurthy: ప్రమాదంలో 'గీతం' మూర్తిని గుర్తించింది ఓ భారతీయ నర్సు!
- బాధితుల వాహనం వెనుకే వీరి వాహనం
- ఘటనా స్థలిలో 40 నిమిషాలపాటు సేవలు
- మృతదేహం 7న విశాఖకు చేరే అవకాశం
అమెరికాలో రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి చెందిన గీతం విద్యా సంస్థల అధినేత, ఎమ్మెల్సీ మూర్తిని తొలుత గుర్తించింది ఓ భారతీయ నర్సు అని వెల్లడైంది. అమెరికాలో నర్సుగా పనిచేస్తున్న ఉమా రావిపాటి, ఆమె సహచరురాలు ఒకరు టెక్సాస్ నుంచి అలస్కాకు విహార యాత్రకు వచ్చారు. మూర్తి బృందం ప్రయాణిస్తున్న వాహనం వెనుకే వీరి వాహనం వస్తోంది. తమ కళ్లముందే ప్రమాదం జరగడంతో వాహనాన్ని నిలిపి వీరిద్దరూ బాధితులకు సహాయపడే ప్రయత్నం చేశారు.
ఆ సందర్భంలో చనిపోయిన వారిలో ఒకరు ఎం.వి.వి.ఎస్.మూర్తి అని ఉమా రావిపాటి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిలోనే ఆమె ఓ నలభై నిమిషాల పాటు ఉండి హెలికాప్టర్ వచ్చే వరకు సేవలందించారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మూర్తి, ఆయన సహచరులు బసవపున్నయ్య, వీబీఆర్ చౌదరి మృతదేహాలకు శవపరీక్షలు పూర్తయ్యాయి.
ఇక అలస్కా పోలీసులు మరణ ధ్రువీకరణ పత్రం అందించగానే మూర్తి, చౌదరి మృతదేహాలను భారత్‌కు పంపేందుకు తానా ప్రతినిధులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బసవపున్నయ్య అంత్యక్రియలు అమెరికాలో చేసే అవకాశం వుందని, అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. అంతా అనుకున్న విధంగా జరిగితే మూర్తి మృతదేహం ఈనెల ఏడో తేదీ ఆదివారం నాటికి విశాఖ చేరవచ్చునని తానా ప్రతినిధులు చెబుతున్నారు.
మృతదేహాలను అలస్కా నుంచి శాన్‌ప్రాన్సిస్కోకు తరలించి అక్కడి నుంచి ఢిల్లీ
మీదుగా విశాఖకు తరలించాల్సి ఉంది. కాగా, శాసన మండలి సభ్యుడైన మూర్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనువైన స్థలం చూడాలని మంత్రి అయ్యన్నపాత్రుడిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.