Adhar: ఈపీఎఫ్ విత్‌డ్రాకు ’ఆధార్‘తో అధికారుల అడ్డుపుల్ల.. తనకు ఆత్మహత్యే శరణ్యమంటున్న ఉద్యోగి!
- సెటిల్మెంట్ సమయంలో దరఖాస్తు తిరస్కరణ
- వివరాల నమోదులో తప్పులున్నాయని వివరణ
- లబోదిబో మంటున్న బాధితుడు
తన ఆధార్ కార్డు వివరాల నమోదులో సిబ్బంది చేసిన పొరపాటు తనకు శాపంగా మారిందని, కష్టాల్లో ఉన్న తనకు ఈపీఎఫ్ డబ్బు ఆసరా అవుతుందనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయిందని ఓ ఉద్యోగి వాపోతున్నాడు. అధికారులు తక్షణం చర్యలు తీసుకుని ఆదుకోకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని చెబుతున్నాడు.
వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రం మయూర్బంజ్ జిల్లా బరిపడాకు చెందిన సంతోష్ జెనా విద్యుత్ విభాగంలో చిరుద్యోగి. అంతంత మాత్రంగా వచ్చే జీతంతో కుటుంబం గడవక తన ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) మొత్తం విత్ డ్రా చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. సెటిల్మెంట్ కోసం ఆఫీస్‌కు వెళితే ‘నీ ఆధార్ కార్డులో తప్పులున్నాయి, మ్యాచ్ కావడం లేదు’ అంటూ అధికారులు దరఖాస్తు తిరస్కరించడంతో లబోదిబో మంటున్నాడు.
అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా వారు పట్టించుకోవడం లేదని వాపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్య పరిష్కరించకుంటే తనకు చావే శరణ్యమని చెబుతున్నాడు. కాగా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.