Virat Kohli: ఈ రికార్డు విషయంలో.... బ్రాడ్ మన్ తరువాత ఉన్న సచిన్ ను వెనక్కి నెట్టేసిన కోహ్లీ!
- 24వ సెంచరీ సాధించిన కోహ్లీ
- బ్రాడ్ మన్ తరువాత అతి తక్కువ ఇన్నింగ్స్ లో ఈ ఘనత
- 123 ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లీ 24వ సెంచరీ
రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కు చెందిన మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన కోహ్లీ, సర్ డాన్ బ్రాడ్ మన్ తరువాత అతి తక్కువ ఇన్నింగ్స్ లో 24వ టెస్టు సెంచరీని చేరుకున్న ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఇంతవరకూ ఆ రికార్డు సచిన్ పేరిట ఉంది. బ్రాడ్ మన్ తన 24వ సెంచరీని 66వ ఇన్నింగ్స్ లో నమోదు చేయగా, ఆ తరువాత సచిన్ 125 ఇన్నింగ్స్ లలో, సునీల్ గవాస్కర్ 128 ఇన్నింగ్స్ లలో, మ్యాథ్యూ హెడెన్ 132 ఇన్నింగ్స్ లలో 24 సెంచరీలు చేశారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 123 ఇన్నింగ్స్ ల్లోనే 24వ సెంచరీ చేసి బ్రాడ్ మన్ తరువాతి స్థానంలో నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్ తొలిరోజున పృథ్వీ షా అద్భుత రీతిలో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత స్కోరు 110 ఓవర్లలో 477 పరుగులు కాగా, కోహ్లీ 106 పరుగులతో క్రీజులో ఉన్నాడు.