it raids: ఐటీ దాడుల ఎఫెక్ట్.. మంత్రులతో అత్యవసరంగా చంద్రబాబు భేటీ!

  • ఐటీ దాడులు, రాజకీయ పరిస్థితులపై చర్చ
  • కేసీఆర్ తీవ్ర విమర్శలపై మంత్రుల అభ్యంతరం
  • తనిఖీలపై టీడీపీ నేతల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల ఈరోజు ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత బీద మస్తాన్ రావు సహా పలువురు నేతలకు సంబంధించిన కంపెనీల్లో ఈ రోజు తనిఖీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. చంద్రబాబు లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం, ఎన్నికలకు ముందు అధికార పార్టీ నేతలు, వారి కంపెనీలపై ఐటీ శాఖ దాడులు చేయడాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐటీ సోదాల పేరుతో కేంద్ర ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని, అధికార దుర్వినియోగంలో మోదీ ప్రభుత్వం ముందంజలో ఉందని ఏపీ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఏపీలో ఐటీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల్లో ఐటీ దాడులు చేసి, వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై మహా కుట్ర జరుగుతోందని, కేసీఆర్, పవన్, జగన్ మోదీతో భాగస్వాములయ్యారని  టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.

  • Loading...

More Telugu News