prudhvishah: పృధ్వీషా గొప్ప ఆటగాడు.. కానీ సెహ్వాగ్‌తో పోల్చకండి: గంగూలీ
- సెంచరీతో అదరగొట్టిన పృధ్వీషా
- సెహ్వాగ్‌తో పోలుస్తూ ప్రశంసలు
- స్పందించిన గంగూలి
అరంగేట్రం మ్యాచ్‌లోనే పృధ్వీషా (134) సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో షా ఆటతీరును వీరేంద్ర సెహ్వాగ్‌తో పోలుస్తూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందించారు. షా గొప్ప ఆడగాడని పేర్కొంటూనే సెహ్వాగ్‌తో పోల్చవద్దని సూచించారు.
‘‘పృధ్వీ షాను సెహ్వాగ్‌తో పోల్చొద్దు. సెహ్వాగ్ గొప్ప ఆటగాడు. క్రికెట్లో భాగంగా షాను ప్రపంచం మొత్తం తిరిగి రానివ్వండి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ టూర్లోనూ రాణిస్తాడు. కానీ అతడిని సెహ్వాగ్‌తో పోల్చకండి. తొలిటెస్టులో శతకం చేసిన రోజు షాకి జీవితాంతం గుర్తుండిపోతుంది. దులీప్, రంజీ ట్రోఫీల తొలి మ్యాచ్‌ల్లో అతడు శతకాలు చేశాడు. ఇప్పుడు టెస్టుల్లోనూ శతకం సాధించాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అండర్ -19వరల్డ్ కప్ టోర్నీ వేరు. టీమిండియాలో టెస్టులు ఆడటం వేరు. కానీ తొలిటెస్టులో అతడు ఆడిన విధానం అద్భుతంగా ఉంది. పృథ్వీ టీమిండియాలో చాలాకాలం పాటు కొనసాగుతాడని అనుకుంటున్నా’’ అని గంగూలీ పేర్కొన్నారు.