rythu bandhu: షరతులతో ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ చేయమన్న ఈసీ!
- రైతుబంధు పథకం అమలులో ఉన్నదే
- దీనికి ఎన్నికల కోడ్ వర్తించదు
- రైతులకు నేరుగా చెక్కులివ్వొద్దన్న ఈసీ
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ చేయడానికి వీలు లేదంటూ ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది. ‘రైతుబంధు’ రెండో విడత చెక్కుల పంపిణీ చేసుకోవచ్చని స్పష్టీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), కొన్ని షరతలు విధించింది. తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రాసిన లేఖ మేరకు ఎన్నికల సంఘం స్పందించింది.
రైతుబంధు పథకం అమలులో ఉన్నదే కనుక, దీనికి ఎన్నికల కోడ్ వర్తించదని, చెక్కుల పంపిణీ చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. రైతులకు నేరుగా చెక్కుల పంపిణీ చేయకూడదని, సంబంధిత నగదును రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని ఈసీ సూచించింది. కొత్త రైతులకు చెక్కులు పంపిణీ గానీ, నగదు పంపిణీ గానీ చేయకూడదని, మొదటిసారి చెక్కులు అందుకున్న రైతులకు మాత్రమే రెండో విడత చెక్కులకు సంబంధించిన నగదు ఆయా ఖాతాల్లో జమ చేయాలని చెప్పింది. అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ హెచ్చరించింది.