Nobel: సెక్స్ బానిస నుంచి నోబెల్ వరకూ... నాదియా గాధ!
- 2012లో నదియాను ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు
- ఆపై లైంగిక బానిసగా మార్చడంతో అష్టకష్టాలు
- తలుపుకు తాళం వేయకపోవడంతో తప్పించుకున్న నదియా
- ప్రస్తుతం అత్యాచార బాధితులకు అండగా సేవలు
నదియా మురాద్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. తాను అనుభవించిన ప్రత్యక్ష నరకాన్ని నలుగురికీ చెప్పి, తనలా బాధపడుతున్న వారిలో మనోస్థైర్యాన్ని నింపిన మహిళ. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న నదియా మురాద్ కు, అంతకన్నా ముందే ఐరాస అంబాసిడర్ గా నియమితురాలైంది.
సరిగ్గా ఓ ఆరేళ్లు వెనక్కు వెళితే... అది 2012. ఇరాక్ సరిహద్దుల్లో సిరియాకు దగ్గరగా ఉన్న కోజో అనే గ్రామం. మెసపుటోమియా నాగరికతతో చిగురించిన గ్రామమది. అక్కడున్న వారంతా ఏ మతానికీ చెందని యాజిదీ తెగవాళ్లే. వీరంటే అటు ముస్లింలకు, ఇటు కుర్దులకు చిన్నచూపు. ఓ యాజిదీ కుటుంబంలో ఆరుగురు సోదరుల నడుమ పుట్టిన నాదియా మురాద్ బసీ తహా అంటే, ఆ ఇంట్లో వాళ్లకు ఎంతో ప్రేమ. ఆమెను అల్లారుముద్దుగా చూసుకునేవారు. అప్పుడామెకు 19 సంవత్సరాలు. అప్పుడే ఐఎస్ఐఎస్ తన పడగను విస్తరిస్తోంది.
అదే సంవత్సరం నవంబర్ 29న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కోజోపై దాడి చేశారు. చిన్నా, పెద్దా అని చూడకుండా కాల్పులు జరిపారు. 15 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలను, యువతులను, మహిళలను బందీలుగా చేసుకున్నారు. నదియా ఆరుగురు సోదరులతో పాటు పిన్ని, ఇతర బంధువులను కాల్చి చంపారు. ఆ గ్రామంలో పట్టుబడిన అమ్మాయిలను తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత ఉగ్రవాద శిబిరంలో ఆమె అంగడిబొమ్మగా మారింది.
ఉగ్రవాదులు నిత్యమూ ఆమెను రేప్ చేసేవాళ్లు. రోజుకు ఎంతమంది వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాళ్లో లెక్కే ఉండేది కాదు. సిగరెట్లతో ఒళ్లంతా కాల్చేవాళ్లు. ఇష్టమొచ్చినట్టు కొట్టేవారు. ముఖంపై ఉమ్మేవారు. వాడుకున్నన్ని రోజులు వాడుకుని, మోజు తీరగానే, వేరే ఉగ్రవాదులకు అమ్మేవాళ్లు. తనలాగే మొత్తం 6 వేల మందికిపైనే ఉన్నారని నదియా గుర్తించింది. చేసేదేమీ లేక వారి చేతుల్లో ఆటబొమ్మగా మారిన ఆమెను ఓ రోజు అదృష్టం పలకరించింది. ఆమె బందీగా ఉన్న గదికి తాళం వేయడాన్ని మరచిపోయారు ఉగ్రవాదులు. దీంతో ఆమె అక్కడినుంచి తప్పించుకుని నానా బాధలూ పడి బాహ్య ప్రపంచంలోకి చేరుకోగలిగింది.
2015లో దుహాక్ ర్వాంగా అనే శిబిరంలో ఓ కంటెయినర్ లో కాలం వెళ్లదీస్తున్న ఆమె, బెల్జియంకు చెందిన ఓ మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఆమె కథ ప్రపంచానికి తెలిసింది. తనపై జరిగే రేప్ లను లెక్కించే ఓపిక కూడా ఉండేది కాదని నదియా చెప్పిన మాటలు ప్రపంచాన్ని కదిలించాయి. నాగరిక సమాజం ఆమెకు అండగా నిలిచింది. అత్యాచార బాధితులకు అండగా నిలవాలన్న ఆమె ఆకాంక్ష, నోబెల్ బహుమతిని అందుకునేంత స్థాయికి ఎదిగేలా చేసింది.