lover murder: ప్రియురాలి హత్య కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష!

  • హైదరాబాద్‌ ఆరో అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు తీర్పు
  • నాలుగేళ్లపాటు విచారణ జరిపిన న్యాయస్థానం
  • మరో ముగ్గురు నిర్దోషులుగా విడుదల

పెళ్లి చేసుకోమని నిలదీస్తోందని ప్రియురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యచేసిన ప్రియుడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ హైదరాబాద్‌ ఆరో అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నాలుగేళ్ల పాటు కేసును విచారించిన కోర్టు మృతురాలి మరణ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ విధంగా తీర్పునిచ్చింది.

స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కథనం మేరకు...ముషీరాబాద్‌కు చెందిన ఆవుల సాయిరాంయాదవ్‌ (24) స్థానికంగా ఉన్న ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మోజు తీరాక ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. ప్రియురాలు గట్టిగా నిలదీయడంతో ఆమెను చంపేయాలని నిర్ణయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెకు ఫోన్‌ చేసి తన వాహనంలో పెట్రోల్‌ అయిపోయిందని, తీసుకురావాలని కోరాడు.

ఆమె బాటిల్‌లో పెట్రోల్‌ పోయించుకుని తన ద్విచక వాహనంపై సాయిరాం ఇంటికి వచ్చింది. ఆమె వచ్చాక ఇద్దరి మధ్య పెళ్లి విషయమై మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో ప్రియురాలు తెచ్చిన పెట్రోల్‌నే ఆమెపై పోసి నిప్పంటించేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసు పరిశీలించిన జడ్జి మృతురాలి మరణ వాంగ్మూలాన్ని పరిశీలించి జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడి కుటుంబ సభ్యుల్లో మరోముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు.

  • Loading...

More Telugu News