S-400: మీ డీల్ మీదే... అయితే, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు... ట్రయంఫ్ క్షిపణులపై తొలిసారి స్పందించిన అమెరికా!
- రష్యాతో కుదిరిన ఎస్-400 క్షిపణుల డీల్
- భాగస్వామ్య దేశాల రక్షణ అవసరాలపై జోక్యం చేసుకోబోము
- మా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలన్న అమెరికా
ఇండియాను శత్రు దుర్భేద్యం చేసేలా ఎస్-400 ట్రయాంఫ్ క్షిపణుల డీల్ కుదిరిన నేపథ్యంలో అమెరికా తొలిసారి స్పందించింది. తమ సన్నిహిత, భాగస్వామ్య దేశాల ఆయుధ సంపత్తిపై తాము జోక్యం చేసుకోబోమని, ఇదే సమయంలో అమెరికా ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
అమెరికా వద్దని చెప్పినప్పటికీ, భారత రక్షణ అవసరాల దృష్ట్యా, రష్యాతో ఈ డీల్ ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీల సమక్షంలో డీల్ కుదిరింది. ఇందులో భాగంగా భూమి ఉపరితలం నుంచి ఆకాశంలో దూసుకు వచ్చే ఎటువంటి క్షిపణులనైనా గాల్లోనే తుత్తునియలు చేసేయవచ్చు.
లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఎస్-400 అత్యాధునికమైనది. చైనా 2014లో వీటిని రష్యా నుంచి కొనుగోలు చేయగా, ఇప్పుడు ఇండియాకూ ఇవి రానున్నాయి. కాగా, భారత్ లో ఆరు న్యూక్లియర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి కూడా రష్యా అంగీకరించింది. 2022లో భారత్ తలపెట్టిన 'గగన్ యాన్'కు వెళ్లే వ్యోమగాములకు తగిన నైపుణ్యం లభించేలా శిక్షణ ఇచ్చేందుకూ రష్యా అంగీకరించింది.