East Godavari District: 55 ఏళ్ల లవ్ స్టోరీ.. భార్య కోసం ‘ప్రేమ మందిరం’ నిర్మించిన భర్త!
- తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
- ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలు
- ప్రేమానురాగాలతోనే గుడి కట్టినట్లు వెల్లడి
పాతకాలంలో రాజులు తమ భార్యలు చనిపోతే తమ ప్రేమకు గుర్తుగా స్మారకాలను నిర్మించేవారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ కూడా అలాంటిదే. ఇదే కోవలో తన భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ మాజీ ఉపాధ్యాయుడు ఆమెకు ప్రేమ మందిరాన్ని నిర్మించాడు. దాని ప్రారంభోత్సవానికి అన్ని ఊర్లు తిరిగి ఆహ్వాన పత్రికలు పంచాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని అయినవిల్లి మండలం నల్లచెరువుకు చెందిన మోటూరి భైరవస్వామి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డును పొందారు. ఏడాది క్రితం ఆయన భార్య సత్యవతి చనిపోయారు. దీంతో ఆమె ఎడబాటును తట్టుకోలేని భైరవస్వామి భార్య జ్ఞాపకార్థం రూ.3.5 లక్షల వ్యయంతో ప్రేమ మందిరాన్ని నిర్మించారు. అనంతరం ఆహ్వాన పత్రికలతో ఇంటింటికి వెళ్లి ‘నా భార్య ప్రసాదాన్ని తిని, ఆత్మకు శాంతి చేకూరాలని ఆశీర్వదించండి’ అని కోరాడు.
ఈ విషయమై భైరవస్వామి మాట్లాడుతూ.. 55 ఏళ్ల సంసారంలో తన భార్య అత్యంత ప్రేమానురాగాలతో నడుచుకుందని తెలిపారు. సత్యవతి చనిపోయాక అవయవదానం కోసం ఆమె పార్థివదేహాన్ని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి అప్పగించానని చెప్పారు. తన భార్య సత్యవతి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మందిరాన్ని నిర్మించినట్లు చెప్పారు.