KCR: మూడు రోజులు సోదాలు చేయించి ఏం సాధించారు?: రేవంత్‌ రెడ్డి ఫైర్‌

  • ఓటుకు నోటు కేసులో ముందు నన్నుదాటాకే ఎవరైనా
  • సెంటిమెంట్‌ రగిలించి లబ్ధిపొందాలని కేసీఆర్‌ చూస్తున్నారు
  • చంద్రబాబును టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నది ఇందుకే

కేంద్రంతో కుమ్మక్కయి ఓటుకు నోటు కేసు పేరుతో తనపై మూడు రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులతో సోదాలు చేయించి ఏం సాధించారని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదవి పోతుందన్న భయంతో కేసీఆర్‌ ఆడుతున్న నీచ రాజకీయాల్లో భాగమే ఇదంతా అని వ్యాఖ్యానించారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్‌ సెంటిమెంట్‌ రగిలించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

రానున్న ఎన్నికలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్యనేనని స్పష్టం చేశారు. కానీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ చంద్రబాబు అన్నట్లు చిత్రీకరించేందుకు ఆయనను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు విషయంలో ముందు తనను దాటాకే ఎవరి జోలికైనా వెళ్లాల్సి ఉంటుందన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో కెల్లా కేసీఆర్‌ అధముడన్నారు.

ఇప్పుడు ఆంధ్రావోళ్లు అని మాట్లాడుతున్న కేసీఆర్‌కు అమరావతికి వెళ్లినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇక, తనపై ఐటీ దాడులు జరిగిన సందర్భంలో కొన్నిచానెళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని, పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురించాయని అన్నారు. దీనిపై ఆయా సంస్థలు వివరణ ఇవ్వాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News