JC: దమ్ముంటే తాడిపత్రిలో సత్తా చూపు: జేసీకి వైసీపీ పెద్దారెడ్డి సవాల్
- పెద్దారెడ్డి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
- జేసీ వత్తిడితోనేనన్న పెద్దారెడ్డి
- జేసీ బ్రదర్స్ భయపడుతున్నారని వ్యాఖ్య
జేసీ దివాకర్ రెడ్డికి దమ్ముంటే, తాడిపత్రికి వచ్చి, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. నేడు ఆయన తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోగా, మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి, జేసీ సోదరుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే తనను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, తాను నిరసన తెలుపుతుంటే, జేసీ బ్రదర్స్ కు భయమెందుకని ప్రశ్నించారు.
జేసీ దివాకర్ రెడ్డికి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తాడిపత్రి ప్రాంతంలోని పోలీసులు జిల్లా ఎస్పీ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడం కన్నా, జేసీ చెప్పినట్టు పనిచేయడానికే ఆసక్తి చూపుతున్నారని విమర్శించారు. ఇటీవల ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై జేసీ దగ్గరుండి దాడులు చేయించారని, ఆయనపై కేసు పెట్టాలంటేనే పోలీసులు భయపడే పరిస్థితి ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జేసీ సోదరులకు తగిన బుద్ధి చెప్పనున్నారని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.