chattisgargh: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల కమిషన్.. ఒకే రోజున ఫలితాల ప్రకటన!
- ఛత్తీస్ గఢ్ లో రెండు దశల్లో పోలింగ్
- మధ్యప్రదేశ్, మిజోరాంలో ఒకేసారి ఎన్నికలు
- తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఈరోజు విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో, మిగిలిన రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న ప్రకటిస్తామన్నారు. తెలంగాణ, రాజస్తాన్ లో ఒకే తేదీన అంటే డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తామని తేల్చిచెప్పారు.
ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. నామినేషన్ దాఖలుకు 23 వరకూ గడవు ఇస్తామన్నారు. ఛత్తీస్ గఢ్ లో వచ్చే నెల 12న తొలి దశ పోలింగ్, 20న రెండో దశ పోలింగ్ ను నిర్వహిస్తామన్నారు. ఇక మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నవంబర్ 28న పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల కమిషన్ ప్రజలకు ఫొటోలున్న ఓటర్ స్లిప్పులను జారీ చేస్తుందనీ, ఇవి గుర్తింపు పత్రాలుగా ఉపయోగపడతాయని వెల్లడించారు. ఓటర్లకు సాయం చేసేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రావత్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే వారి అభ్యర్థుల ఖాతాలోకి ఆ వ్యయాన్ని జమ చేస్తామని హెచ్చరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఓ పోలింగ్ స్టేషన్ ను కేవలం మహిళల కోసమే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ఓటర్లతో పాటు విధులు నిర్వహించే సిబ్బంది, పోలీసులు కూడా మహిళలే ఉంటారన్నారు.
ఈ ఎన్నికల్లో అత్యాధునికమైన మార్క్-3 ఓటింగ్ యంత్రాలను వాడుతున్నామని రావత్ అన్నారు. ఎవరికి ఓటేశామో తెలుసుకునే వీవీప్యాట్ యంత్రాలను ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఈవీఎంలకు అమరుస్తామని వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ కు ముందు మాక్ పోలింగ్ ను నిర్వహిస్తామన్నారు.