Iran: అమెరికా ఆంక్షలు బేఖాతరు.. ఇరాన్‌తో భారత్ ఒప్పందం.. మన కరెన్సీలోనే చెల్లింపులు!
- ఇరాన్ నుంచి చమురు కొనుగోలుకు ఒప్పందం
- డాలర్లను పక్కనబెట్టి రూపాయల్లో చెల్లింపులు
- నవంబర్ నుంచే అమెరికా ఆంక్షల అమలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై విధించిన ఆంక్షలను భారత ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఇరాన్ తో స్నేహాన్ని కొనసాగించడానికే ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) నవంబర్ నెలలో ఇరాన్ నుంచి 1.25 మిలియన్ టన్నుల చమురు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని సమాచారం.
మరో విషయం ఏమిటంటే, మోదీ ప్రభుత్వం డాలర్లను పక్కన బెట్టి ఇరాన్‌కు రూపాయిల్లో చెల్లింపులు చేయనుంది. అమెరికా విధించిన ఆంక్షలు నవంబర్ నుంచే అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. తన అవసరాల నేపథ్యంలో భారత్ అగ్రరాజ్యాన్ని ఢీకొనేందుకు సిద్ధమైంది. ఆంక్షలు అమలైనా ఐవోసీ ఎప్పుడు ఎంత పరిమాణంలో ఇరానియన్ చమురు కొనుగోలు చేస్తుందో ఇప్పుడు కూడా అంతే చేస్తుందని సమాచారం.