paritala sunitha: మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలని కేసీఆర్ అన్నగారిని కోరుకుంటున్నా!: పరిటాల సునీత
- కేసీఆర్, బాబు మధ్య అన్నదమ్ముల సంబంధం ఉండాలి
- బాబు గురించి అంత పెద్దపెద్ద మాటలు మాట్లాడొద్దు
- ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర మైన పదజాలం ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలను ఏపీ టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్, చంద్రబాబు మధ్య అన్నదమ్ముల మధ్య ఉండే సంబంధం ఉండాలని ఈ రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలే ఉన్నారని, వారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలని ‘కేసీఆర్ అన్నగారిని నేను కోరుకుంటున్నా’అని అన్నారు.
చంద్రబాబు గురించి అంత పెద్దపెద్ద మాటలు మాట్లాడొద్దని కోరుకుంటున్నామని, ఎందుకంటే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతగా కష్టపడ్డారో కేసీఆర్ కు తెలుసని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కావడానికి, ఐటీ పరిశ్రమలు రావడానికి కారణం చంద్రబాబేనని కేటీఆర్ కూడా అన్నారని, మరి, అలాంటి వ్యక్తిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం తగదని కోరారు.
సీఎం స్థానంలో ఉన్న కేసీఆర్ గురించి వేరే వాళ్లు మాట్లాడితే..‘ఇలా మాట్లాడతారా?’ అని ఆయన బాధపడ్డారని, మరి, అదే సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు గురించి బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు గురించి ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి కేసీఆర్ కు ఎందుకొచ్చిందని అన్నారు. ఈ రెండు రాష్ట్రాలు బాగుపడాలని, ఈ రెండు రాష్టాలనూ రెండు కళ్లుగా చంద్రబాబు చూస్తున్నారని, కేసీఆర్ కు కూడా అలాంటి భావనే కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.