Telangana: ఒక కుటుంబానికి ఒకే టికెట్.. మరో 10 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల!
- గండికోటలో ఎన్నికల కమిటీ భేటీ
- విధేయత ఉన్న గెలుపు గుర్రాలకే ఛాన్స్
- బలమైన సీట్లు వదులుకోవద్దని సీనియర్ల సూచన
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16 కల్లా మొత్తం పూర్తిస్థాయి జాబితాను ప్రకటించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. గండిపేటలోని ఓ రిసార్టులో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ).. సీట్ల కేటాయింపు, మిత్రపక్షాలతో సర్దుబాటుపై చర్చించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
పార్టీ పట్ల విధేయత, గెలిచే సత్తా ఉన్న నేతలనే పోటీకి దింపాలని పీఈసీ నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులతో జాబితాను పీఈసీ రూపొందిస్తుంది. అనంతరం ఈ జాబితాను ముగ్గురు సభ్యుల స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. పరిశీలన అనంతరం ఈ జాబితా నుంచి తుది అభ్యర్థిని ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఎంపిక చేస్తుంది. కాగా, పీఈసీ సమావేశం సందర్భంగా బలమైన సీట్లను మిత్రపక్షాలకు వదులుకోవద్దని పార్టీ సీనియర్ నేతలు గట్టిగా వాదించినట్లు సమాచారం. ఈసారి కూడా ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే గతంలో రెండు టికెట్లు పొందిన నేతలకు ఈసారి కూడా మినహాయింపు ఇచ్చేందుకు ఆమోదముద్ర తెలిపారు.