chetan bhagat: నువ్వు చాలా స్వీట్ గా ఉన్నావ్.. నన్ను ప్రేమిస్తావా?: యువతులకు చేతన్ భగత్ లైంగిక వేధింపులు
- వాట్సాప్ లో వేధించిన ప్రముఖ రచయిత
- ‘మీ టూ’లో భాగంగా బయటపెట్టిన బాధితులు
- పెళ్లి ఓ లేబుల్ మాత్రమేనని సెలవిచ్చిన చేతన్
భారత్ లో సామాన్య, గ్రామీణ యువతకు ఇంగ్లిష్ నవలలను పరిచయం చేసిన రచయితగా చేతన్ భగత్ కు మంచి పేరు ఉంది. త్రి పాయింట్ సమ్ వన్, ఇండియా 2020, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ వంటి హిట్ నవలల్ని అందించారు. అయితే ఇటీవలి కాలంలో హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై ‘మీ టూ’ ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా-నానాపటేకర్ వివాదం కూడా బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో రచయిత చేతన్ భగత్ తమతో అనుచితంగా ప్రవర్తించాడని పలువురు మహిళలు ముందుకు వస్తున్నారు.
ఓ మహిళా జర్నలిస్టుకు వాట్సాప్ లో చేతన్ సందేశాలు పంపాడనీ, అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన చాటింగ్ ను సదరు మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియాలో బయటపెట్టింది. ‘మీకు వివాహమైంది’ అని తాను చెబుతున్నా పెళ్లి ఓ గుర్తింపు మాత్రమేనని చేతన్ సందేశం పంపాడని వాపోయింది. తనతో ఫ్లర్టింగ్ చేస్తున్న చేతన్ భగత్ వ్యవహారశైలిని సదరు మహిళ ఎండగట్టింది. మరోవైపు చేతన్ వేధింపులు తట్టుకోలేక ఫేస్ బుక్ లో అతడిని బ్లాక్ చేయాల్సి వచ్చిందని మరో యువతి ఫేస్ బుక్ లో బయటపెట్టింది.
దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. పలువురు నెటిజన్లు చేతన్ భగత్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో అప్రమత్తమైన చేతన్.. తాను తప్పు చేశానని అంగీకరించాడు. తన కారణంగా బాధపడిన మహిళలతో పాటు భార్య అనూషాకు సైతం క్షమాపణలు చెప్పాడు. చేతన్ రాసిన త్రీ పాయింట్ సమ్ వన్ పుస్తకం త్రీ ఇడియట్స్ పేరుతో తెరకెక్కింది. ఇక టూస్టేట్స్ పుస్తకం కూడా సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.