Chandrababu: చంద్రబాబు వార్నింగ్ దెబ్బకు దిగివచ్చిన గాలి ముద్దుకృష్ణమ కుటుంబీకులు!
- నగరి టికెట్ కోసం గాలి కుమారులు భాను, జగదీశ్ పోరు
- తమకే ఇవ్వాలని చంద్రబాబు ముందు డిమాండ్
- ఈరోజు ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్నతో భేటీ
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత సంక్షోభం ముగిసింది. ఏపీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్నతో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబీకులు ఈ రోజు విజయవాడలో భేటీ అయ్యారు. గాలి ముద్దుకృష్ణమ సతీమణి, కుమారులు భాను, జగదీశ్‌లు సమావేశమై నగరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు.ఈ సందర్భంగా తమ కుటుంబంలో నగరి టికెట్ ను ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసేందుకు వారు అంగీకరించారు. ఒకవేళ బయటివారికి ఇచ్చినా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో నగరి పార్టీ టికెట్ ను తమకే ఇవ్వాలని గాలి కుమారులు భాను, జగదీశ్ పట్టుబట్టారు.
దీంతో భాను, జగదీశ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఇద్దరూ ఒక్కతాటిపైకి రావాలని సూచించారు. పెద్దాయన ఉన్నంతవరకూ పార్టీ, కుటుంబం ఒక్కతాటిపైనే ఉన్నాయని.. ఆయన చనిపోయాక పరిస్థితులు అస్తవ్యస్తం కావడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఏకాభిప్రాయానికి రాకపోతే నియోజకవర్గ బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తానని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన 350 మంది ముఖ్యనేతలు, కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు నగరి టికెట్ తనకే కావాలంటూ విద్యాసంస్థల అధిపతి అశోక్‌రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఎవరిని నగరి ఇన్ చార్జీగా నియమిస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది.