Chandrababu: మన శక్తి ఏంటో నిరూపించుకోవాలి... కోల్కతా ర్యాలీకి రండి: చంద్రబాబుకు మమతా బెనర్జీ ఆహ్వానం
- జనవరి 19న కోల్కతాలో భారీ ర్యాలీ
- ర్యాలీలో పాల్గొని దేశ సమైక్యతను బలోపేతం చేద్దాం
- రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్న పశ్చిమ బెంగాల్ సీఎం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరిలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్కతాలో నిర్వహించబోయే భారీ ర్యాలీకి రావాలంటూ చంద్రబాబుకు మమత లేఖ రాశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల శక్తి ఏపాటిదో ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని మమత పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ ర్యాలీ మంచి వేదిక అవుతుందని మమత అభిప్రాయపడ్డారు.
దేశ చరిత్రలోనే ఎన్నో కీలక సమావేశాలకు సాక్షీభూతంగా నిలిచిన కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ వద్ద జనవరి 19న ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్టు మమత లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని తాను భావిస్తున్నట్టు మమత వివరించారు. ఇక్కడి నుంచే ప్రతిపక్షాల స్వరాన్ని వినిపిద్దామని కోరారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రజాస్వామ్య, రాజ్యంగా వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.