Telangana: మేనిఫెస్టో కోసం కేసీఆర్ ముమ్మర కసరత్తు.. దసరా తర్వాత ప్రకటన

  • జనరంజకంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో
  • డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి పథకంలో మార్పులు
  • ప్రకటించే వరకు గోప్యత పాటించాలని ఆదేశం

తెలంగాణ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. మేనిఫెస్టో తయారీలో వివిధ పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మేనిఫెస్టో తయారీలో బిజీగా ఉంది. దసరా తర్వాత దీనిని విడుదల చేయాలని భావిస్తోంది. ప్రజలను ఆకర్షించేలా దీనిని రూపొందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమై చర్చించారు.

పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమై ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై చర్చించింది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాల కొనసాగింపు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకేమేమి ఆశిస్తున్నారు? ఉపాధి, ఉద్యోగ కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు.. తదితర వాటిపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
అలాగే, పింఛన్లు పెంచాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకాల్లో మార్పులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ బాధ్యతలను లబ్ధిదారులకే ఇవ్వడం, దళితులకు భూమి విషయంలో వారు కొనుక్కుంటే డబ్బులు చెల్లించడం వంటి మార్పులు చేయాలని, ఈ విషయాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అలాగే, మేనిఫెస్టోలో ఏయే విషయాలను చేర్చాలనే దానిపై అభ్యర్థులతోనూ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అయితే, మేనిఫెస్టో ప్రకటించే వరకు అందులోని అంశాలేవీ బయటపడకుండా గోప్యత పాటించాలని నేతలను కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News