raghavendra rao: చరణ్ లాంటి హీరోను చెవిటివాడిగా చూపించడానికి ధైర్యం కావాలి: దర్శకుడు రాఘవేంద్రరావు
- యువ దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు
- ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు
- హీరోలు ఇమేజ్ ను పక్కన పెట్టేస్తున్నారు
తెలుగు తెరకి గ్లామర్ ను అద్దిన అగ్రదర్శకులలో కె.రాఘవేంద్రరావు ఒకరుగా కనిపిస్తారు. కథాకథనాలను నడిపించడంలోను .. పాటలను మాస్ ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కించడంలోను ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉండేది. అలాంటి రాఘవేంద్రరావు తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో తన కెరియర్ కి సంబంధించిన ముచ్చట్లను పంచుకున్నారు. "తమిళ .. బెంగాలీ .. హిందీ భాషా చిత్రాల్లో జరుగుతోన్న ప్రయోగాలు తెలుగులో జరగడం లేదు. తెలుగు దర్శకులు ప్రయోగాలు చేయడానికి ముందుకు రావడం లేదనే విమర్శ వుంది .. ఈ విషయంపై మీరు ఏమంటారు?" అనే ప్రశ్న రాఘవేంద్రరావుకు ఎదురైంది.
అప్పుడు ఆయన స్పందిస్తూ .. "కొంతకాలం క్రితం వరకూ ఈ విమర్శ నిజమేనని అనుకోవచ్చు. కానీ ఇప్పుడొస్తోన్న యువ దర్శకులు చాలామంది కొత్తగా ఆలోచిస్తున్నారు .. డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ వెళుతున్నారు. చరణ్ లాంటి హీరోను చెవిటివాడిగా చూపించాలంటే మేమంతా భయపడేవాళ్లం. కానీ సుకుమార్ అద్భుతంగా ఆ పాయింట్ ను హ్యాండిల్ చేశాడు. ఇక ఇమేజ్ ను పక్కన పెట్టేసి హీరోలు ముందుకురావడం కూడా మంచి పరిణామం" అని చెప్పుకొచ్చారు.