raghavendra rao: నాగార్జునతో 'ప్రేమ నగర్' చేద్దామని రామానాయుడు గారు అన్నారు: రాఘవేంద్రరావు
- నాన్నగారి ప్రభావం నాపై వుంది
- ఆయనని చూసి నేర్చుకున్నాను
- అందుకే అక్కినేనితో ఎక్కువ సినిమాలు చేయలేదు
దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్.సూర్యప్రకాశ్ రావు దర్శక నిర్మాతగా .. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. "ఆయన ప్రభావం మీపై ఎంతవరకూ వుంది?' అనే ప్రశ్న 'చెప్పాలని వుంది' అనే కార్యక్రమంలో రాఘవేంద్రరావుకు ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "దర్శకుడిగా నాపై మా నాన్నగారి ప్రభావం ఎంతో వుంది. అసలు సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన రావడానికి మా నాన్నగారే కారకులు. సొంత బ్యానర్ పై కూడా ఆయన సినిమాలు చేసేవారు.
అందరూ సినిమా బాగుందని అనేవారు గానీ, డబ్బులు వచ్చేవి గాదు. ఆ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. దర్శకుడిగా నాన్నగారు చేసిన పొరపాట్లు నేను చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆయన చేసిన సినిమాల్లో 'ప్రేమ నగర్ ' సెన్సేషనల్ హిట్. అంతకన్నా బాగా సినిమా తీయలేనేమోననే ఉద్దేశంతోనే నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయలేదు. రామానాయుడుగారు .. 'ప్రేమ నగర్' ను మళ్లీ నాగార్జునతో చేద్దామని అన్నారు. అంత సాహసం చేయొద్దండీ .. అటు నాగార్జునకి పేరు పోతుంది .. ఇటు మనకి పేరు పోతుందని వారించానని చెప్పుకొచ్చారు.