TRS: టీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: బీజేపీ నేత లక్ష్మణ్
- టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోంది
- అది మహాకూటమి కాదు తెలంగాణ ద్రోహుల కూటమి
- బాబుకు వత్తాసు పలుకుతున్న ‘కాంగ్రెస్’ను క్షమించరు
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని అన్నారు. ఎన్నికల విధుల పేరిటన ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనులు కూడా పూర్తికాని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.
ఈ సందర్భంగా ‘మహాకూటమి’పై ఆయన నిప్పులు చెరిగారు. ఇది తెలంగాణ ద్రోహుల కూటమని, తెలంగాణను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ, రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లించిన చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని దుయ్యబట్టారు. ఆనాడు తెలంగాణ అనుకూల ప్రకటన వెలువడ్డ తర్వాత యూటర్న్ తీసుకున్న చంద్రబాబునాయుడు ఏ రకమైన విన్యాసాలు చేశాడో అందరికీ తెలుసని అన్నారు.
అటువంటి టీడీపీతో కాంగ్రెస్ పార్టీ కలవడం దారుణమని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర పన్నుతున్న చంద్రబాబునాయుడుని, ఆయనకు వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు క్షమించరని లక్ష్మణ్ అన్నారు. ఈ కూటమిలో చేరిన తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ కూడా సంజాయిషీ ఇచ్చుకోవాలని అన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబుతో కలిసి పనిచేయాలని ఎందుకనుకుంటున్నారో కోదండరామ్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కూటమి, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కూటమిలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు.