lokesh: ఏపీ ఐటీ చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజు: మంత్రి నారా లోకేష్

  • కృష్ణా జిల్లాలో హెచ్ సీఎల్ కు భూమి పూజ
  • హెచ్ సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చేయడం హర్షణీయం
  • 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం

ఏపీ ఐటీ చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజని మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ హెచ్ సీఎల్ క్యాంపస్ ఫేజ్-1కు లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హెచ్ సీఎల్ నూతన క్యాంపస్ శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం, హెచ్ సీఎల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకూ ఏపీకి వచ్చిన కంపెనీల్లో హెచ్ సీఎల్ అతిపెద్దదని, హెచ్ సీఎల్ వంటి సంస్థలు రాష్ట్రంలో క్యాంపస్ ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ప్రపంచంలోని మూడు అగ్రగామి టెక్నలాజికల్ కంపెనీల్లో హెచ్ సీఎల్ ఒకటని, నూతన ఆవిష్కరణలకు తాము ఎప్పుడూ ప్రాధాన్యత నిస్తామని, 2019 నాటికి లక్ష ఉద్యోగాలు ఐటీ రంగంలో కల్పించాలనేది తమ లక్ష్యమని చెప్పారు.
ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి

హెచ్ సీఎల్ సీఈఓ రోషిణి నాడార్ మాట్లాడుతూ, తమ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అత్యంత క్రియా శీలమైన లక్ష్యంతో, సరికొత్త హెచ్ సీఎల్ రూపుదిద్దుకోబోతోందని అన్నారు. విజయవాడ హెచ్ సీఎల్ లో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉంటుందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. హెచ్ సీఎల్ ఏర్పాటుతో యువత ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని కచ్చితంగా చెప్పగలనని అన్నారు.

తొలిదశలో 28 ఎకరాల్లో భారీ క్యాంపస్ నిర్మిస్తున్నాం

హెచ్ సీఎల్  ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శివశంకర్ మాట్లాడుతూ, తమ సంస్థ ఏపీకి రావడం కోసం లోకేశ్ ఎంతో కృషి చేశారని, ఏపీ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా హెచ్ సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలిదశలో 28 ఎకరాల్లో భారీ క్యాంపస్ నిర్మిస్తున్నామని, నాలుగేళ్లలో క్యాంపస్ పనులు ప్రారంభిస్తుందని అన్నారు.  బెంగళూరు, హైదరాబాద్ తర్వాత ఐటీకి అవకాశం ఉన్న ప్రాంతం అమరావతేనని అన్నారు.

  • Loading...

More Telugu News