Bank employees: విలీన ప్రతిపాదనకు నిరసన.. నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త ఆందోళన!
- ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
- ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం
- 12న భవిష్యత్తు కార్యాచరణ : ఏఐబీఈ
జాతీయ స్థాయిలో బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల పటిష్టీకరణ పేరుతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన పట్టణాల్లో ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈ) జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం తెలిపారు.
ఈనెల 12న ముంబైలో జరిగే సంఘం సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.