Chandrababu: చంద్రబాబు తెలంగాణ పక్షపాతిగా ఉండరు..ఉండలేరు!: మంత్రి హరీశ్ రావు
- చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రాబాబే
- తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా?
- కాంగ్రెస్- టీడీపీ పొత్తు షరతులతో కూడినదా? లేక బేషరతుగానా?
తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. టీడీపీతో ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని అన్నారు. చంద్రబాబుపై ఆధారపడే ప్రభుత్వం తెలంగాణలో ఉంటే కనుక అది తెలంగాణ ప్రయోజనాలకు కచ్చితంగా గండికొడుతుందని విమర్శించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగానే ఉంటారు తప్ప, తెలంగాణ పక్షపాతిగా ఉండరు, ఉండలేరని, ఇది జగమెరిగిన సత్యమని అన్నారు.
కృష్ణానదీ జలాల పంపిణీ జరగాలంటే.. చంద్రబాబు ఏపీ ప్రజల పక్షాన నిలబడతారా? తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా? ఈ విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పొత్తు షరతులతో కూడినదా? లేక బేషరతుగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. కేవలం, అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకుంటోందని మండిపడ్డారు.