Rahul Gandhi: చైనా వాళ్లు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ పైనా ‘మేడిన్ ఇండియా’ అని ఉండాలి: రాహుల్ ఆకాంక్ష
- ‘మేకిన్ ఇండియా’ విఫలమైంది
- సెల్ఫీ తీసుకునే స్మార్ట్ ఫోన్ పై ‘మేడిన్ చైనా’ ఉంటోంది
- ‘మేడిన్ రాజస్థాన్’, ‘మేడిన్ జైపూర్’ అని ఉండాలి
- రాజస్థాన్ లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్
చైనా దేశస్థులు తమ దేశంలో సెల్ఫీలు దిగేందుకు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ పైనా ‘మేడిన్ ఇండియా’ అని ఉండాలని ఆశిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్ లోని థౌల్పూర్ లో ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ, ‘మేడ్ ఇన్ ఇండియా’ అని మోదీ నినాదం ఇచ్చారు కానీ, ‘మీరు సెల్ఫీ తీసుకునే స్మార్ట్ ఫోన్ పై ‘మేడిన్ చైనా’ అని ఉంటోంది! మీరు వినియోగించే వస్తువులపై ‘మేడిన్ రాజస్థాన్’, ‘మేడిన్ జైపూర్’ అని ఉండాలి.
చైనా వారు తమ దేశంలో సెల్ఫీ తీసుకునే స్మార్ట్ ఫోన్ పై కూడా ‘మేడిన్ ఇండియా అని ఉండాలి’ అని రాహుల్ ఆశించారు. ‘మేకిన్ ఇండియా’ విఫలమైందని, టీషర్ట్స్, స్మార్ట్ ఫోన్లు తదితర వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని విమర్శించారు. రైతులు, యువత ప్రయోజనాలను కాపాడడానికి బదులుగా పారిశ్రామికవేత్తలకు రక్షణగా ఉంటున్నారని, మహిళల రక్షణ, ఉద్యోగాల కల్పన విషయంలో మోదీ మాట తప్పారని రాహుల్ దుమ్మెత్తి పోశారు.