KS Jawahar: పవన్‌కు మంత్రి జవహర్ బహిరంగ లేఖ.. దళితులకు టీడీపీ ఎందుకు శత్రువో చెప్పాలని సూటి ప్రశ్న
- ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడేమైంది పౌరుషం
- బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రతీ 15 నిమిషాలకో హత్య, అత్యాచారం
- అయితే, బీజేపీని ప్రశ్నించరు
- దళితుల కోసం పాటుపడుతున్న టీడీపీ చేదు అయిందా?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ బహిరంగ లేఖ రాశారు. తనకు అవగాహన లేదని, అనుభవం లేదని, ఏం చేయాలో తెలియదని చెప్పే పవన్, మరి ఏ అర్హతతో ప్రభుత్వంపై అనవసర నిందలు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు పౌరుషం ఎక్కువని చెప్పే ఆయన, తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు ఏమైందని ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో కేసీఆర్ తాట తీస్తానని హెచ్చరించారని, ఇప్పుడాయనతోనే కలిసి వెళ్తున్నారని విమర్శించారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రతి 15 నిమిషాలకు ఓ హత్య, అత్యాచారం జరుగుతున్నాయని, గత నాలుగున్నరేళ్లలో 52 వేల అత్యాచారాలు జరిగాయన్నారు. అలాగే, 11 మందిని కాల్చి చంపారని, అయినా ఇవేవీ పవన్‌కు కనిపించడం లేదన్నారు.
దళితులంటే గిట్టని వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు పవన్‌కు మిత్రుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. 1.6 లక్షల గిరిజనుల భూములను వైఎస్ తన అల్లుడికి కట్టబెట్టారని, ఈ విషయం మీకు తెలియదా? అని నిలదీశారు. దళితులంటే జగన్‌కు పడదని, అటువంటి వ్యక్తి ఎలా మిత్రుడు అయ్యాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల కోసం గత నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.48 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వివరించారు. దళితుల అభివృద్ధి కోసం పాటు పడుతున్నందుకే టీడీపీ మీకు శత్రువు అయిందా? అని పవన్‌ను నిలదీశారు.
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే మీరు కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నిండం లేదని, కేసీఆర్‌ను బాబాయిగా, కవితను చెల్లెమ్మగా అభివర్ణించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని మంత్రి జవహర్ ప్రశ్నించారు.