Nakkeeran: గవర్నర్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ‘నక్కీరన్’ గోపాల్ అరెస్ట్.. విడుదల!
- గవర్నర్‌కు వ్యతిరేకంగా గోపాల్ కథనాలు
- ఏప్రిల్‌లో జరిగితే తాజాగా కేసు
- విడిచిపెట్టిన కోర్టు
తమిళనాడులోని సంచలన వార పత్రిక నక్కీరన్ సంపాదకుడు ఆర్. గోపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినులను వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయిన ప్రొఫెసర్ నిర్మలాదేవిపై కథనాలు ప్రచురించిన గోపాల్.. అందులో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు వ్యతిరేకంగా రాశారు. దీంతో గవర్నర్ ఉప కార్యదర్శి గోపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై మంగళవారం చెన్నై విమానాశ్రయంలో గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గోపాల్ అరెస్ట్‌పై డీఎంకే సహా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. గోపాల్‌ను ప్రశ్నిస్తున్న చింతాద్రిపేట పోలీస్‌స్టేషన్‌కు ఎండీఎంకే నేత వైగో చేరుకున్నారు. దీంతో ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం గోపాల్‌ను పోలీసులు ఎగ్మూరు 13వ కోర్టులో హాజరుపరిచారు.
ఎప్పుడో ఏప్రిల్‌లో ప్రచురించిన కథనంపై ఇప్పుడు కేసు నమోదు చేయడం సరికాదని గోపాల్ తరపు న్యాయవాది పీటీ పెరుమాళ్ కోర్టుకు తెలిపారు. అదే సమయంలో కోర్టుకు వచ్చిన ‘ది హిందూ’ మాజీ సంపాదకుడు ఎన్.రామ్ అభిప్రాయాన్ని కోర్టు కోరింది. గోపాల్‌పై సెక్షన్ 124 నమోదు చేయడం అన్యాయమని రామ్ బదులిచ్చారు. ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు గోపాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపలేమని పేర్కొంటూ గోపాల్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.