Uttar Pradesh: రాయ్ బరేలీ సమీపంలో పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. ఐదుగురి మృతి!
- పట్టాలు తప్పిన న్యూ ఫరఖా ఎక్స్ ప్రెస్
- రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
- ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ సమీపంలో న్యూ ఫరఖా ఎక్స్ ప్రెస్ (14003) రైలు పట్టాలు తప్పింది. నేటి ఉదయం 6.05 నిమిషాలకు హర్ చందన్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఆరు బోగీలు పట్టాలు తప్పి దూసుకెళ్లాయని, కనీసం ఐదుగురు మరణించగా, పలువురికి గాయాలు అయ్యాయని నార్త్ రన్ రైల్వే డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ వెల్లడించారు.
ఇంజన్ తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయని చెప్పిన ఆయన, విషయం తెలియగానే యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ ను లక్నో నుంచి పంపించామని, దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, మొఘల్ సరాయి స్టేషన్లలో హెల్ప్ లైన్ నంబర్లను సిద్ధం చేశామని, ఈ మార్గంలో రైళ్లన్నింటినీ రద్దు చేశామని, దూర ప్రాంత రైళ్లను దారి మళ్లించామని ఆయన తెలిపారు.
విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి, పరిస్థితిపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు.