Andhra Pradesh: కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయం.. స్పందించకుంటే వచ్చే వారం ఢిల్లీకి ఎంపీల బృందం
- తెలంగాణకు రూ.350 కోట్లు కేటాయించిన కేంద్రం
- ఏపీకి రిక్త హస్తం
- ఘాటు లేఖను సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశం
వెనుకబడిన జిల్లాల కోసం ఇది వరకే ఇచ్చిన రూ.350 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు సాయం చేసి ఏపీకి అన్యాయం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు ఈ విషయంలో కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అయినా స్పందించకుంటే పార్లమెంటు సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు.
మంగళవారం రాత్రి సీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేటాయించిన రూ.350 కోట్లను వెనక్కి తీసుకోవడంపై రాసిన లేఖకు ఇప్పటి వరకు స్పందన లేదని, ఇప్పుడు తెలంగాణకు కేటాయించి ఏపీని నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి పంపేందుకు ఘాటుగా ఓ లేఖను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లేఖ రాసినప్పటికీ స్పందించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.