Silambarasan: రూ.50 లక్షలు కడతావా?.. చర్యలు ఎదుర్కొంటావా?: శింబుకి హైకోర్టు హెచ్చరిక
- నటుడు శింబుతో పాషన్ మూవీ మేకర్స్ ఒప్పందం
- ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ కోర్టుకు
- అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేది లేదన్న నటుడు
తమిళ నటుడు శిలంబరసన్ అలియాస్ శింబుకు మద్రాస్ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకున్న రూ.50 లక్షలను ఈ నెల 31 లోపు తిరిగి చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘అరసన్’ సినిమాలో నటించేందుకు శింబుతో పాషన్ మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. అందులో భాగంగా జూన్ 17, 2013న రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించింది. అయితే, ప్రొడక్షన్ హౌస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నటుడు ఉల్లంఘించడంతో పాషన్ మూవీ మేకర్స్ శింబుపై కోర్టులో దావా వేసింది.
తనపై వేసిన దావాపై స్పందించిన శింబు మాట్లాడుతూ ప్రొడక్షన్ హౌస్ ఇప్పటి వరకు ప్రొడక్షన్ ప్రారంభించలేదని, కాబట్టి తనకిచ్చిన అడ్వాన్స్‌ను వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పాడు. వాదనలు విన్న జస్టిస్ ఎం.గోవిందరాజ్ రూ.85.50 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలని నటుడిని గతంలో ఆదేశించారు. అయితే కౌన్సిల్ సబ్మిషన్ అనంతరం దానిని రూ.50 లక్షలకు మార్చారు. ఈ నెల 31లోపు రూ.50 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలని శింబును ఆదేశించారు. ఈ విషయంలో విఫలమైతే అతడి ఆస్తులను అటాచ్ చేయాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు.