Pune: ఇండియాలో తొలిసారి... పుర్రెను మార్చి అద్భుతం చేసిన వైద్యులు!
- నాలుగేళ్ల బిడ్డకు పుర్రె మార్పిడి శస్త్రచికిత్స
- విజయవంతం చేసిన పుణె వైద్యులు
- పాప కోలుకుందన్న తల్లి
భారత వైద్య చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. పుణెకు చెందిన వైద్యులు, నాలుగేళ్ల బాలిక పుర్రెను మార్చి, ఆమెకు పునర్జన్మనిచ్చారు. బాలిక పుర్రెలో సమస్య నెలకొన్న కారణంగా 60 శాతం భాగాన్ని తిరిగి చేర్చాలని వైద్యులు నిర్ణయించగా, అమెరికాకు చెందిన సంస్థ, పాప పుర్రెకు సంబంధించిన కొలతలు తీసుకుని, పాలీ ఎథిలిన్ బోన్ తో త్రీ డైమెన్షనల్ రూపంలో దాన్ని తయారు చేసింది. దీన్ని వైద్యులు విజయవంతంగా ఆమెకు అమర్చారు. ఇండియాలో స్కల్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతం కావడం ఇదే తొలిసారి.
గత సంవత్సరం మే 31న జరిగిన యాక్సిడెంట్ లో పాప పుర్రె తీవ్రంగా దెబ్బతింది. రెండు సర్జరీల తరువాత పాపను బతికించి, డిశ్చార్జ్ చేసినప్పటికీ, సమస్య మాత్రం తొలగలేదు. ఈ సంవత్సరం మే 18న పాపకు స్కల్ ఇంప్లాంట్ సర్జరీ చేశామని, ఆపై పాప కోలుకునేంత వరకూ జాగ్రత్తగా చూశామని పుణెకు చెందిన భారతీ ఆసుపత్రి వైద్య నిపుణుడు డాక్టర్ జితేంద్ర ఓస్వాల్ వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఆమెను తమ ఆసుపత్రికి తీసుకువచ్చారని, తొలుత ఆమెను వెంటిలేటర్ సపోర్టుతో బతికించి, సీటీ స్కాన్ చేసి చూస్తే, పుర్రె చితికిందన్న విషయం తెలిసిందని ఆయన అన్నారు. తన బిడ్డ ఇప్పుడు స్కూలుకు వెళుతోందని, చక్కగా ఆడుకుంటూ ఆనందంగా ఉందని పాప తల్లి వ్యాఖ్యానించింది.