pepsico: అమ్మో! రాజకీయాలు నాకు చేతకావు.. ఒకవేళ నేను వస్తే జరిగేది మూడో ప్రపంచయుద్ధమే! ఇంద్రా నూయి
- ఏసియా సొసైటీ ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరు
- గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరణ
- మీడియా ప్రశ్నలకు జవాబిచ్చిన పెప్సికో మాజీ సీఈవో
ఇంద్రా నూయి.. పెక్సికో కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి ఇటీవల తప్పుకున్న మహిళ. ఫోర్బ్స్-100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో పలుమార్లు ఆమె చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక ఏసియా సొసైటీ ఫౌండేషన్ అందించే ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2018 సంవత్సరానికి ఇంద్రా నూయి న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఆమె ముచ్చటించారు. మీడియా ప్రతినిధులతో పాటు పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంత్రి వర్గంలో చేరవచ్చు కదా? అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ..‘నాకు రాజకీయాలు సరిపోవు. అసలు నాకు లౌక్యంగా మాట్లాడటమే రాదు. అలాంటిది నేను అందరితో మంచిగా ఎలా మాట్లాడగలను? ఒకవేళ నేనే గనుక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది’ అని నూయి చమత్కరించారు.
గత 40 ఏళ్లుగా ఉదయం 4 గంటలకు నిద్రలేవడం అలవాటు అయిపోయిందని ఇంద్రా నూయి తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా రోజుకు 18-20 గంటలు పనిచేశానని వెల్లడించారు. ఇప్పుడు తనకు విశ్రాంతి దొరికిందనీ, రోజుకు ఆరుగంటలు ఏకధాటిగా ఎలా నిద్రపోవాలి? అనేదాన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. వీలైతే ప్రపంచ దేశాలన్నీ చుట్టిరావాలని అనుకుంటున్నట్లు నూయి తన మనసులోని మాటను బయటపెట్టారు.