Amith shah: తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్లో.. రాహుల్ కంపెనీ వల్లో సాధ్యం కాదు: అమిత్ షా
- రూ. 2లక్షల 30 వేల కోట్ల నిధులిచ్చాం
- 2019లో విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం
- ఎవరికీ కోత పెట్టకుండా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు
బీజేపీ ప్రభుత్వం వచ్చాక మోదీ రూ.ఒక లక్షా 15,900 కోట్లకు పైగా తెలంగాణ అభివృద్ధి కోసం నిధులిచ్చారని, అదనంగా ఇతర పథకాల రూపంలో మరికొంత ఇచ్చారని.. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ. 2లక్షల 30 వేల కోట్ల నిధులిచ్చారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. కరీంనగర్ బీజేపీ తొలి ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఎంత నిధులిచ్చిందీ.. ఏ ఏ కార్యక్రమాల కోసం ఇచ్చిందీ లెక్కలతో సహా వివరించారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ కుటుంబం వల్లో.. రాహుల్ కంపెనీ వల్లో సాధ్యం కాదు అని అమిత్ షా స్పష్టం చేశారు.
‘‘రజాకార్లు చేసిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు మరవగలరా? సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినోత్సవంగా ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటోంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓవైసీకి భయపడి విముక్తి దినోత్సవాన్ని నిర్వహించట్లేదు. బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే 2019లో విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించడాన్ని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతం కన్నా రిజర్వేషన్ మించకూడదు. అలాంటపుడు మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఎవరికి కోత పెడతావని ప్రశ్నిస్తున్నా. ఎవరికీ కోత పెట్టకుండా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్ రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోండి.
బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ చొరబాటు దారులు ఈ దేశంలోనే ఉండాలా? అని ప్రశ్నిస్తున్నా. బంగ్లాదేశ్ చొరబాటు దారులను అస్సాంలో గుర్తిస్తే ఒకవైపు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు రాహుల్ బాబా నాయకత్వంలో గొడవ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే బంగ్లాదేశ్ చొరబాటు దారులను దేశం నుంచి తరిమికొడతాం. కరీంనగర్ జిల్లా వాసి, అలాగే ప్రధానిగా వ్యవహరించిన పీవీ నరసింహారావు గారి అంతిమ సంస్కారాన్ని కూడా అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జరపనీయలేదు. కేసీఆర్ గారు, మీరు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, సోనియాగాంధీ నాయకత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 13వ ఫైనాన్స్ కమిషన్ కింద రూ.16,597 కోట్లు మాత్రమే తెలంగాణకు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మోదీ... రూ.ఒక లక్షా 15,900 కోట్లకు పైగా తెలంగాణ అభివృద్ధి కోసం నిధులిచ్చారు.
ముద్ర లోన్‌లో రూ.1500 కోట్లు, స్మార్ట్ సిటీ కోసం రూ.197 కోట్లు, అమృత్ మిషన్ కింద రూ.833 కోట్లు, స్వచ్ఛ భారత్ రూ.376 కోట్లు, అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ కింద రూ.800కోట్లు, హైదరాబాద్ మెట్రో రూ.660 కోట్లు, 19 రైల్వే ప్రాజెక్టులకు 19వేల కోట్లు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం కింద 45 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.1200 కోట్లు, వెనుకబడిన 9 జిల్లాలకు రూ.900 కోట్లు, 30 రోడ్డు ప్రాజెక్టులకు రూ.40వేల కోట్లు, మహిళ, బాలికల కోసం రూ.1000 కోట్లు, రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ పునరుద్ధరణ కోసం రూ.5000 కోట్లు, మెదక్ ఎన్ఐఎంజడ్ విషయంలో రూ.17,300కోట్లు, తెలంగాణ ఎయిమ్స్ రూ.1200 కోట్లు, సర్వశిక్షా అభియాన్ కోసం 1353 కోట్లు, సనత్‌నగర్ ఆస్పత్రి కోసం రూ.1200 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ కోసం రూ400 కోట్లు. ఇవి మాత్రమే కాకుండా, అదనంగా మరో ఒక లక్షా 15వేల కోట్లు కలిపి మొత్తంగా రెండు లక్షల 30 వేల కోట్లు ఇవ్వడం జరిగింది.
తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ కుటుంబం వల్లో.. రాహుల్ కంపెనీ వల్లో సాధ్యం కాదు. దేశాన్ని విభజించే పనిలో ఈ పార్టీలు నిమగ్నమై ఉంటే.. దేశాన్ని నిర్మించే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మోదీ నిమగ్నమయ్యారు. మీరు విభజించే వారితో ఉంటారా? నిర్మించేవారితో ఉంటారా?’’ అని అమిత్ షా ప్రశ్నించారు.