Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులో దేశంలో అగ్రస్థానం!
- ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులో ఏపీ సరికొత్త చరిత్ర
- 16,34,503 స్ట్రీట్ లైట్ల ఏర్పాటు
- వెల్లడించిన కేంద్ర ఇంధన వనరుల శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనతను సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఏపీ ప్రభుత్వం 16,34,503 వీధి దీపాలు ఏర్పాటు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికీ ఎల్‌ఈడీ విద్యుత్ బల్బులను రాయితీతో పంపిణీ చేసింది. అయితే, వీధి దీపాల కోసం వినియోగించే విద్యుత్తును కూడా ఆదా చేయాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం పంచాయతీల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లోని మొత్తం గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్ఎల్), రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) కలిసి పంచాయతీల్లో రూపాయి పెట్టుబడి లేకుండా పాత బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ దీపాలను అమరుస్తున్నారు. ఈ సందర్భంగా ఆదా అయ్యే విద్యుత్తును, నిర్వహణ వార్షిక ఖర్చుల్లో 20 శాతం పంచాయతీలకు, మిగతా దానిని ఈఈఎస్‌ఎల్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి ఇవ్వనున్నారు. తొలుత పదేళ్లపాటు ఈ రెండు సంస్థలే వాటి నిర్వహణను చూసుకోగా, ఆ తర్వాత పంచాయతీలకే అప్పగిస్తారు.
ఇప్పటికే తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వంద శాతం ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయగా, మిగతా జిల్లాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏటా 444 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. దీని మొత్తం విలువ రూ.266 కోట్లు.