Titley: పెను విలయం సృష్టిస్తూ తీరం దాటిన 'తిత్లీ'... శ్రీకాకుళం జిల్లాలో భీతావహ పరిస్థితులు... చంద్రబాబు సమీక్ష!
- గొల్లపాడు - పల్లెసారధి మధ్య తీరాన్ని తాకిన తిత్లీ
- నేడంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ప్రజా జీవనం భీతావహం
- అధికారులు జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు
ఒడిశా, ఉత్తరాంధ్రను వణికిస్తున్న 'తిత్లీ' తుపాను పెను విలయం సృష్టిస్తూ తీరం దాటింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, కవిటి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, పలాస, గార, సోంపేట తదితర ప్రాంతాల్లో తుపాను ప్రజా జీవనాన్ని భీతావహం చేసింది. తుపాను తీరం దాటుతున్న వేళ, గంటకు 150 కిలోమీటర్ల వరకూ గాలులు వీచాయి. వజ్రపుకొత్తూరు మండలంలోని గొల్లపాడు - పల్లెసారధి మధ్య తిత్లీ తీరాన్ని తాకింది.
తీరం దాటిన తరువాత బలహీనపడే క్రమంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఉదయం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీజీఎస్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం మాట్లాడారు. తుపాను తీరం దాటిన క్రమంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా వజ్రపుకొత్తూరు, దాని పరిసర మండలాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. తుపాన్ పూర్తిగా బలహీనపడేంత వరకూ పరిస్థితిని అనుక్షణం సమీక్షిస్తూ ఉండాలని సూచించారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద ప్రజలు నిలబడవద్దని కోరారు.